శ్రీనివాస్ రాజ్యసభకు వెళ్లతారా?
సిసిసి నడిపించేవరు?
తిరుపతి : జగన్మోహన్ రెడ్డికి పిసిసి పదవి దక్కుతుందా? లేదా? ప్రస్తుత పిసిసి చీఫ్ రాజ్యసభ కోరకుంటున్నారా? ఆయన రాజ్యసభకు వెళ్ళితే ఆ పదవి ఎవరిని వరిస్తుంది? అధిష్టానంతో చనువుగా ఉన్నంత మాత్రానా పిసిసి పదవి వస్తుందా? స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి ఏఐసిసి చేస్తున్న ఆలోచన ఏమిటి? ఇవన్నీ కాంగ్రెస్ నాయకుల పట్టి పీడిస్తున్న ప్రశ్నలు. ఇందులో ఏది సాధ్యమవుతుంది. ఎంత వరకు అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో తాజాగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దేశంలోనే కాంగ్రెస్‌కు బలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపు దిద్దుకుంది. అయితే వైఎస్ మరణం తరువాత ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న బెంగ అధిష్టానాన్ని పట్టి పీడిస్తోంది. వైఎస్ ఉన్నంత కాలం రాజకీయ అస్త్రసన్యాసం చేసిన నాయకులు ఒక్క సారిగా తెరపైకి వచ్చారు. వైఎస్ జగన్‌ను అడుగడుగునఅడ్డుపడుతున్నారు. అంతా అధిష్టానమేనని హడావుడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వ బాధ్యతలు రోశయ్య చేతుల్లోనే ఉంచాలని నిర్ణయించింది. అయితే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు.
వైఎస్, డిఎస్‌ల జోడీ ఫలవంతమైందిగా ముద్రపడింది. ఎన్నికల తరువాత ఆ పదవి నుంచి రాజ్యసభకు వెళ్లాలని డిఎస్ భావించారు. వైఎస్ ఉన్నంతకాలం ఆ పదవిలో ఉంటూ ఇతర పార్టీల నాయకులకు వల వేయడంతో డిఎస్ కూడా కీలక పాత్ర వహించారు. అయితే వైఎస్ మరణం తరువాత నేరుగా అధిష్టానంతో సంబంధాలు నెరిపే వారి సంఖ్యం అధికమైంది. ఇలాంటి పరిస్థితులలో పిసిసి అధ్యక్షుడుగా తాను కూడా పలచన అవుతాననే భావనకు వచ్చారు. వీలైనంత త్వరగా రాజ్యసభకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు. అధిష్టానం చుట్టూ ప్రదిక్షణలు చేస్తూ జనానికి దూరంగా హైఫై రాజకీయాలు చేసే నాయకుల హవా పెరుగుతోంది.
అయితే ఈపరిస్థితులలోఅధిష్టానం ఏ ఒక్కరిని నిర్లక్ష్యం చేసే పరిస్థితులలో లేదు. ఇదే అలుసుగా భావించిన హై...ఫై.... నాయకులు పిసిసికి పదవికి వల వేస్తున్నారు. జగన్‌ను కేంద్ర మంత్రి వర్గానికి పంపి రాష్ట్ర రాజకీయాలలోకి రావాలనుకునే వారి జాబితాలో కే.కేశవరావు ముందు వరుసలో ఉన్నారు. ఈయనతో పాటు వెంకటస్వామి, వి.హనుమంతరావు ఇదే వరుసలో ఉన్నారు.
అయితే వైఎస్‌ది చాలా బలమైన వర్గం అనే విషయం అధిష్టానానికి చాల స్పష్టంగా తెలుసు. ఒక బలమైన వర్గం బలహీన పడితే పార్టీకి కూడా పెద్ద నష్టం వాటిల్లినట్లే అనడంలో ఏ మాత్రం అనుమానం లేదు. పైగా ఒక వైపు సానుభూతి, మరోవైపు జగన్‌కున్న జనాకర్షణ ఉన్న యువనాయకుడుని కాదని పిసిసి వీరికి ఇస్తే ఎలా? అంశంపై అధిష్టానం చాలా సీరియస్‌గా ఆలోచిస్తోంది. హై...ఫై.... నాయకులకు ఇస్తే తమతో లాయల్‌గా ఉంటారు. కాని రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏమవుతుందోననే బెంగ కూడా ఉంది. పైగా ఈ పర్యాయం రాష్ట్రంలో యువ ఎమ్మెల్యేలు, నాయకులు చాలామంది తెరపై కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో అనుభవం ఉన్న రోశయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు పిసిసి యువరక్తానికి కేటాయిస్తే బాగుంటుందని వాదనలు అధిష్టానికి చేరాయి. ఇలాంటి పరిస్థితులలో మేడంకు విధేయత కలిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, కడప ఎంపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ప్రతిపాదనలు వచ్చాయి.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పిసిసి పదవిపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడిందనడంలో ఏ మాత్రం అనుమానం లేదు. అధిష్టానం ఏం చేస్తోందో తెలుసుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.
లోడ్ అవుతోంది...